నటి సమంత (Samantha) రూత్ ప్రభు (Ruth Prabhu).. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఆమె, తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు, ముఖ్యంగా విడాకులు (Divorce), మయోసైటిస్ (Myositis) వంటివాటి గురించి బహిరంగంగా పంచుకుంటారు. తాజాగా, తాను ఎవరు, ఎంత పెద్ద సెలబ్రిటీ, జీవితంలో ఏం సాధించానో అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.
డిజిటల్ డిటాక్స్, కొత్త అనుభవం
విడాకుల తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి కోలుకుంటున్న సమంత, తిరిగి నటనలోకి రావడానికి సిద్ధమయ్యారు. వెబ్ సిరీస్‌లలో నటించడంతో పాటు, ఇటీవల ‘శుభం’ (‘Shubham’) అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగానూ మారారు. నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సమంత, తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన చేతిలో ఎప్పుడూ సెల్‌ఫోన్ ఉంటుందని, ఈ విషయంపై సడెన్‌గా ఒక ఆలోచన వచ్చిందని ఆమె తెలిపారు. వెంటనే తన సెల్‌ఫోన్‌ను మూడు రోజుల పాటు స్విచ్ఛాఫ్ చేసినట్లు చెప్పారు. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరినీ చూడలేదని, పుస్తకాలు చదవడం, రాయడం వంటివి చేయలేదని, నిజానికి ఏ పనీ చేయలేదని ఆమె వెల్లడించారు.
“నేను ఒక సాధారణ జీవిని”
ఆ మూడు రోజులు తన మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చినట్లు సమంత తెలిపారు. ఆ అనుభవం చాలా కొత్తగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. తన ‘ఈగో’లో చాలా భాగం తన సెల్‌ఫోన్‌తోనే ముడిపడి ఉందని అప్పుడు అర్థమైందని చెప్పారు. తాను ఎవరని, ఎంత సెలబ్రిటీ అని, ఏం సాధించానని సెల్‌ఫోనే చెబుతుందని, అది లేని రోజున తాను ఒక సాధారణ జీవిననే భావన కలిగిందని సమంత అన్నారు.
పుట్టుకకు, గిట్టుకకు మధ్య కాలంలో సెల్‌ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మన పెద్దలకు, ఆరోగ్యానికి సెల్‌ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది తాను అవగతం చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.