రూ.200 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న ‘సైయారా’ మూవీ

రూ.200 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న 'సైయారా' రికార్డ్స్ బద్దలు!

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘సైయారా’ (Sayara) గురించే చర్చ. ఈ చిన్న సినిమా విడుదలై వారం రోజులు దాటినా, బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. కలెక్షన్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.

బాక్సాఫీస్ సంచలనం ‘సైయారా’
అహన్ పాండే (Ahan Pandey), అనీత్ పడ్డా (Anith Padda) హీరోహీరోయిన్లుగా, మోహిత్ సూరి (Mohit Suri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్లలో విడుదలైంది. అయితే, తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో, రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించి, ఇటీవల బాలీవుడ్‌ (Bollywood)లో విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. కనీసం ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటివరకు అమీర్ ఖాన్ (Aamir Khan) ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par) (రూ.164 కోట్లు), అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ‘రైడ్ 2’ (Raid 2) (రూ.173 కోట్లు) చిత్రాల కలెక్షన్లను అధిగమించి, ‘సైయారా’ అత్యధిక వసూళ్లు సాధించిన డెబ్యూ చిత్రంగా రికార్డులకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

‘సైయారా’ కథ: ప్రేమ, ఎంపికల మధ్య సంఘర్షణ
‘సైయారా’ కథ విషయానికొస్తే, వాణి బత్రా (అనీత్ పడ్డా) ఒక రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేష్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండిస్తాడు. ఆరు నెలల పాటు వాణి ఆ డిప్రెషన్‌లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది.

అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. అతను ఒక సింగర్, అవకాశాల కోసం తిరుగుతుంటాడు. వాణితో కలిసి ఓ పాట కోసం పనిచేస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేష్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది? అనేది మిగతా కథ.

Join WhatsApp

Join Now

Leave a Comment