ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Sunil Kumar – IPS) మరియు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) (Raghurama Krishnam Raju – RRR) మధ్య ఇటీవలి కాలంగా జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సీబీఐ కేసులు (CBI Cases, రాజకీయ పరిణామాలపై వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక సునీల్ కుమార్ విధానాలే కారణమని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు.
“నన్ను చంపాలని చూశారు”
సునీల్ కుమార్ విధానాలపై తాను బహిరంగంగా విమర్శలు చేయడంతోనే తనను చంపే ప్రయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనను కొట్టిన సమయంలో వైద్యులపై ఒత్తిడి తెచ్చి డా. ప్రభావతి (Dr. Prabhavathi) ద్వారా బలవంతంగా సంతకాలు పెట్టించి తప్పుడు మెడికల్ రిపోర్టు ఇచ్చారన్నారు. తనపై దాడి జరిగిన సమయంలో సునీల్ కుమార్ పక్క గదిలోనే ఉన్నారని, అయినప్పటికీ ఆయన జోక్యం చేసుకోలేదని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. అంతేకాదు, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత డీఎస్పీ, ఏఎస్ఐ, కొంతమంది కానిస్టేబుల్స్‌తో సమావేశమై సునీల్ కుమార్ వారిని బెదిరించాడని కూడా వ్యాఖ్యానించారు.
విచారణపై వ్యంగ్య వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో జరిగిన విచారణ తీరుపై కూడా రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. “వెయ్యి శుభములు కలుగు నీకు పోయిరా మరదలా అన్నట్టుగా నాలుగు గంటల పాటు సునీల్ కుమార్‌ను విచారణ చేసి పంపేశారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సునీల్ కుమార్‌ను మళ్లీ విచారణకు పిలిచారా? లేక పిలుస్తారా? అన్న విషయం తనకు తెలియదని చెప్పారు.
రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్
సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మధ్య ఈ స్థాయిలో ఆరోపణలు, ప్రతిఆరోపణలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, తదుపరి విచారణలు ఎలా కొనసాగుతాయోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.








