కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల పరిధిలోని కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.