రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, వ్యవసాయ శాఖ మంత్రికి రోజా బహిరంగ సవాల్ విసిరారు.
“కూటమి ప్రభుత్వం పాలనలో రైతుల సమస్యలను పట్టించుకునే వారు లేరు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా కొరతపై వాస్తవాలు సాక్షి పత్రికలో వస్తే ఫేక్ న్యూస్ అంటూ కేసులు పెడతామనే బెదిరింపులు చేస్తున్నారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు కనిపించడం లేదా?” అంటూ సీఎంను ప్రశ్నించారు.
“సీఎం చంద్రబాబు గెలిపించిన కుప్పంలోనే రైతులు యూరియాకోసం తిప్పలు పడుతున్నారని చెప్పారు. నిరసనలు ఫేక్ అని కొట్టిపారేస్తున్న సీఎం చంద్రబాబు.. రైతులు ఆందోళన చేస్తున్న సహకార కేంద్రాల వద్దకు వచ్చి ఆ మాట చెప్పగలరా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక, డ్రగ్స్, గంజాయి దోపిడీ సరిపోలేదా? యూరియాలో కూడా దోచుకోవాలా?” అంటూ సెటైర్లు వేశారు. ఈనెల 9న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళనలు జరగనున్నట్లు రోజా ప్రకటించారు. అన్ని జిల్లాల్లో ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసనలు చేపడుతుందని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 4, 2025
సీఎం చంద్రబాబుకు @YSRCParty మాజీ మంత్రి రోజా సవాల్
– రైతులు నిరసన చేస్తున్న సహకార కేంద్రాలకు చంద్రబాబు, పవన్, అచ్చెన్నాయుడు వచ్చి ఫేక్ అని చెప్పగలరా..?
– యూరియా నిరసనలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్తలు ఫేక్ కాదా..? pic.twitter.com/RNuIoQTZer