మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్‌

మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్‌

కృష్ణా జిల్లాలో నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయ వేడి రగుల్చుతోంది. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టాన్ని పరిశీలించడానికి జగన్ పర్యటనకు సిద్ధమవుతుండగా, పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.

జగన్ పర్యటన సందర్భంగా అడుగడుగున ఆంక్షలు విధించారు. పర్యటనలో పాల్గొనాలనుకున్న రైతులు, స్థానిక ప్రజలకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. జగన్‌ను కలవకూడదని, మాట్లాడకూడదని రైతులపై ఆంక్షలు విధించార‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రైతులు, వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌.ఎన్‌. గొల్లపాలెం గ్రామాల్లో మాత్ర‌మే ప‌ర్య‌టించాల‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు కండీష‌న్ పెట్టారు. అటుగా వెళ్లే రూట్స్ మొత్తం పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించారు.

పర్యటనకు సంబంధించిన కఠిన నియమావళి ప్రకారం, కేవలం 500 మందికి మాత్రమే, అలాగే 10 వాహనాలకు మాత్ర‌మే అనుమతి ఇచ్చారు. ద్విచక్ర వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీస్ అధికారులు ప్రకటించారు. అంతేకాక, జగన్ పర్యటనలో హాజరుకావొద్దంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి నాయకులకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. పాల్గొనాలని ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని వర్గాలు చెబుతున్నాయి.

జగన్ పర్యటనలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడతానని ప్రకటించినప్పటికీ, పోలీసు ఆంక్షలు రైతుల్లో ఆగ్రహం రేపుతున్నాయి. “రైతుల సమస్యలు వినడానికే పర్యటన అయితే, వారిని అడ్డుకోవడం ఎందుకు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, అధికార యంత్రాంగం భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించామని స్పష్టం చేస్తోంది. అయితే ఈ చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment