కూటమి ప్రభుత్వం (Coalition government) గురించి కొత్త విషయం బయటకొచ్చింది. ప్రభుత్వం ఒక ముఖ్య నాయకుడి వంటింట్లోకి వచ్చిచేరిందట. ఎంతటి బలమైన శాఖలో అయినా ఆ ఇంటి వంట గది నుంచి వచ్చే ఆదేశాలకు తిరుగుండదట. ఏ పదవి కావాలన్నా.. మేడం (Madam) భరోసా ఇస్తే ఆ పని అయిపోయినట్లేనని, ఒక్క మాట చెబితే క్షణాల్లో ఆర్డర్ కాపీలు (Order Copies) వెళ్లిపోతాయట. ఇంతకీ ఎవరా మేడం.. ఏ భవనంలోని వంట గది నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి.. ఏం జరిగిందనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఏపీ మెడికల్ కౌన్సిల్ (AP Medical Council) చైర్ పర్సన్ పోస్టు కోసం ప్రభుత్వంలోని ‘సీనియర్’ నేత సతీమణి ఒక డాక్టర్‌ను, మరో మంత్రి మరొక డాక్టర్‌ను సిఫార్సు చేయడంతో ఆ పదవి నియామకంలో కన్ఫ్యూజన్ మొదలైందట. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన చైర్‌పర్సన్ (Chairperson), ఇతర కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. పది నెలలపాటు నాన్చి ఇటీవల ఆరుగురు వైద్యులతో ప్రభుత్వం ఏపీ మెడికల్ కౌన్సిల్‌ను ప్రకటించింది. వారిలో ఒకరు చైర్ పర్సన్, మరొకరు వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించాల్సి ఉంది.
‘ముఖ్య’ నేత భార్య ముందుగానే హామీ..?
ప్రభుత్వంలోని ముఖ్య నేత సతీమణి సిఫార్సుతో విజయవాడకు చెందిన ఒక వైద్యురాలిని మెడికల్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. మేడం సిఫార్సు చేసిన డాక్టర్‌కు చైర్‌పర్సన్ పదవిని సైతం కట్టబెడతానని ‘మేడం (Madam)’ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. సదరు వైద్యురాలు తొలుత మేడం సిఫార్సుతో నేరుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సభ్యురాలు కావాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కాగా, ఎన్ఎంసీ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కోటా ఉండదని వైద్య శాఖ తెలిపింది. ఇదే సందర్భంలో రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌లకు ఎన్ఎంసీలో ప్రాతినిధ్యం ఉంటుందని తెలియడంతో ఆ పోస్టుకు ముఖ్య నేత సతీమణి మేడం ద్వారా సిఫార్సు చేయించుకున్నట్టు సమాచారం.
మాకూ కోటా ఉందంటూ మరో ఇద్దరు పోటీ
మరోవైపు బీజేపీ (BJP) కోటాలో సభ్యుడిగా నియమితులైన వైద్యుడికి చైర్మన్ పదవిపై ఓ మంత్రి హామీ ఇచ్చారన్న చర్చ నడుస్తోంది. కూటమిలోని మరో పార్టీ జనసేన (Janasena) కోటా నుంచి ఓ సభ్యురాలు సైతం చైర్‌పర్సన్ పోస్టుపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేసిన రోజునే చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక చేపట్టాలని అధికారులు భావించారు. అయితే, ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టత లేకపోవడంతో ఎన్నిక నిర్వహించలేదని సమాచారం.