ఎన్నికల కమిషన్, ఈవీఎంల పనితీరు వంటి అతి సున్నితమైన అంశాలపై తన గళాన్ని నిరంతరాయంగా వినిపిస్తూ పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. తాజాగా భాషా విధానంపై తన నిర్మోహమాట వైఖరిని దేశ ప్రజలకు వినిపించారు. తెలంగాణ కులగణన సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ “భారతదేశంలో ఒక వ్యక్తి విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశం ఏంటంటే.. అది ఇంగ్లిష్ విద్య” అని అన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విధానాన్ని పరోక్షంగా మెచ్చుకుంటూనే తన దారీ అదేనంటూ కుండబద్ధలు కొట్టేశారు. జగన్ వ్యాఖ్యలనే AS IT IS గా జాతీయ మీడియా ముందు వ్యక్తపరచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏపీలో జగన్ తన ఐదేళ్ల టెన్యూర్‌లో ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నాడు-నేడు బడులను బాగుపరచడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అనివార్యం చేశారు. ఈ ఇంగ్లిష్ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు తెలుగు సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చినా, జగన్ వెనక్కి తగ్గలేదు. మన పిల్లలు విశ్వవేదికలపై విహరించాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని చెప్పారు. ఆర్థికంగా బలవంతులైనవారి పిల్లలే కాదు.. నిరుపేద విద్యార్థులు కూడా ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడాలని విమర్శకులకు బదులిచ్చారు. జగన్ తాను నమ్మిన విధానాన్నే AS IT IS గా అమలు చేశారు.
“ఇంగ్లిష్ విద్యే ఇప్పటికీ భారతదేశంలో వ్యక్తిగత పురోగతి, విజయానికి ప్రధాన ప్రమాణం. కానీ, బీజేపీ నాయకులు ఇంగ్లీష్ తీసేయాలని చెబుతున్నారు. వారి పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారు? ఇంగ్లిష్ మీడియంలోనే కదా! మరి దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఆ అవకాశాన్ని ఎందుకు ఇవ్వకూడదు?” అని రాహుల్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం రాహుల్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. బలహీన వర్గాల అభివృద్ధికి ఇంగ్లిష్ మాధ్యమ విద్య అవసరమని స్పష్టం చేశారు. సమాజ అభివృద్ధికి ఆర్థిక బలం, మానవబలం, మానసిక బలం అవసరమని, ఇవి లేకపోతే పురోగతికి మార్గం లేదన్నారు. “ఈ రోజుల్లో ఇంగ్లిష్ భాష అవసరంగా మారింది. దీనిని ప్రోత్సహించకపోతే, పేద ప్రజలకు భవిష్యత్తు అంధకారమే” అని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ భాషపై ఆందోళనలు చేసే వారు తమ పిల్లల్ని మాత్రం టాప్ ఇంగ్లిష్ స్కూళ్లలో చదివించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఖర్గే పేర్కొన్నారు.
సరిగ్గా ఇవే మాటలు జగన్ నోటి నుంచి గత ఆరేళ్ల క్రితం వినిపించాయి. ఏపీలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన అనంతరం గతంలోని ప్రతిపక్షాల నుంచి వ్యతిరేక స్వరాలు వినిపించాయి. ఆ మాటలకు దీటుగా జగన్ విమర్శకుల పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారని ప్రశ్నించిన సందర్భాలు రాహుల్, ఖర్గే గుర్తుచేశారు.







