పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో(Pakistan-Occupied Kashmir – PoK) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. గత 26 రోజులుగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాక్ ప్రభుత్వ విధానాలు (Pakistan Government Policies), సైన్యం తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలను పాకిస్తాన్ బలప్రయోగంతో అణచివేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరపడంతో పాటు, పీఓకేకు వెళ్లే ఆహార సరఫరాలు, మందులను కూడా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆహార(Food Shortage), ఔషధ కొరతను (Medicine Shortage) ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో పీవోకే ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ (Sardar Aman Khan) భారత్ వైపు ఆశగా చూస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్కోట్లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియంత్రణ రేఖ (LoC) అవతల ఉన్న భారత ప్రజలు తమకు అండగా నిలవాలని కోరారు. “ఆహారం, మందులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైతే నియంత్రణ రేఖ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధమే” అని ఆయన పేర్కొనగా, సభలో పాల్గొన్న ప్రజలు కూడా అందుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
మరోవైపు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో జూలై 8 నుంచి మరింత ఉధృతమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించింది. విద్యుత్ చార్జీలు, గోధుమ పిండి ధరలు, ప్రాథమిక హక్కులు, కాశ్మీరీ శరణార్థులకు రిజర్వేషన్ల వంటి అంశాలపై ప్రజలు గళమెత్తుతున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ చర్యలను నిరసిస్తూ లండన్లో వేలాది మంది ప్రవాసీ కాశ్మీరీలు భారీ ర్యాలీ నిర్వహించడం అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై దృష్టిని ఆకర్షిస్తోంది.








