పల్నాడు జిల్లా పిన్నెల్లి (Pinnelli)లో చోటుచేసుకున్న మందా సాల్మన్ (Manda Salman) హత్య ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా వైసీపీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తాము విధించిన బహిష్కరణను ఉల్లంఘించి గ్రామంలో అడుగుపెట్టాడనే కారణంతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన కొందరు గూండాలు (Goons) ఇనుప రాడ్లతో సాల్మన్‌పై దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన సాల్మన్‌ను కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిన ఆయన నాలుగు రోజుల తర్వాత మృతి చెందారు.
కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గ పరిధిలోనే ఏడుగురు వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసకు వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) పిలుపు మేరకు రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించనున్నారు.
సాల్మన్ కేసులో న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. త్వరలో స్వయంగా కుటుంబాన్ని కలుసుకుని పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అంత్యక్రియల సమయంలో ఉద్రిక్తత
శుక్రవారం పిన్నెల్లిలో సాల్మన్ అంత్యక్రియలు జరగకుండా తెలుగుదేశం నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. మృతదేహంతో వస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతల రాక కారణంగానే అడ్డుకుంటున్నామని పోలీసులు బహిరంగంగా చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫోన్‌లో వైఎస్ జగన్‌తో మాట్లాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర తర్వాత పరిస్థితి సర్దుబాటు కావడంతో సాల్మన్ మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించారు.
భయంతో గ్రామం వదిలిన కుటుంబం
పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు సాల్మన్ మొదటి నుంచీ వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామం విడిచి వెళ్లాలని తెలుగుదేశం నాయకులు అతనికి హెచ్చరికలు జారీ చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రాణభయంతో సాల్మన్ కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి వెళ్లిపోయాడు. తర్వాత వైసీపీ నేతల భరోసాతో రెండు నెలల క్రితం కుటుంబం తిరిగి పిన్నెల్లికి రావడానికి ప్రయత్నించగా, స్థానికుల సహాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పంచాయితీ అనంతరం సాల్మన్‌ను మినహాయించి మిగిలిన కుటుంబ సభ్యులకు మాత్రమే గ్రామంలో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.
ఇటీవల సాల్మన్ భార్య అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 10న ఆమెను చూసేందుకు పిన్నెల్లికి వచ్చిన సాల్మన్‌పై దాడి జరిగింది. రావద్దని హెచ్చరించినప్పటికీ ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ గూండాలు రాడ్లతో కొట్టారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ దాడే చివరకు సాల్మన్ ప్రాణాలు తీసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.








