టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుందా లేదా అన్న విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. భద్రతా కారణాలు చూపిస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఇప్పుడు అదే బాటలో పాకిస్తాన్ కూడా బాయ్‌కాట్ హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్‌లో జరగనున్న మ్యాచ్‌లపై అభ్యంతరం తెలుపుతూ, కనీసం భారత్‌తో జరిగే మ్యాచ్‌కైనా దూరంగా ఉంటామని లీకులు ఇస్తుండటం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పటికే స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేయగా, పాకిస్తాన్ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
పాకిస్తాన్ తప్పుకుంటే ఖాళీ భర్తీ చేసేందుకు పలు దేశాలు ముందుకొస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఐస్లాండ్ ట్వీట్ ద్వారా స్పందించగా, తాజాగా ఉగాండా కూడా టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు సిద్ధమంటూ ఐసీసీకి బహిరంగంగా విజ్ఞప్తి చేసింది. “పూర్తిగా సిద్ధంగా ఉన్నాం… ప్యాడ్స్ కట్టుకున్నాం, పాస్‌పోర్టులు రెడీ” అంటూ ఉగాండా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ నిర్ణయం ఏంటి అన్నది తేలే వరకు ఈ అంశం అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగనుంది.








