ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ వార్త అందింది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా జట్టులో స్థానం దక్కకపోవడంతో 33 ఏళ్ల ఆసిఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఆసిఫ్ అలీ అంతర్జాతీయ కెరీర్
ఆసిఫ్ అలీ తన క్రికెట్ కెరీర్‌ను 2018లో ప్రారంభించి, పాకిస్తాన్ తరపున 79 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో వన్డేలు, టీ20లు ఉన్నాయి. అతను పాకిస్తాన్ జట్టులో ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్‌లో, ఒక ఫినిషర్ పాత్రలో చోటు సంపాదించుకున్నాడు.
నిరాశపరిచిన ప్రదర్శన
అతను ఒకట్రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా, చాలా సందర్భాలలో జట్టుకు అవసరమైన ఫినిషర్ పాత్రను సరిగా నిర్వర్తించలేకపోయాడు. దీంతో జట్టులో అతని స్థానం నిలకడగా లేదు.
సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటన
సెప్టెంబర్ 1న ఆసిఫ్ అలీ తన సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను. పాకిస్తాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో అతిపెద్ద గౌరవం. నా దేశానికి సేవ చేయడం నాకు చాలా గర్వకారణం” అని రాశాడు. ఈ సందర్భంగా తన సహచరులకు, కోచింగ్ సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
2022లో జరిగిన ఆసియా కప్‌లో ఆసిఫ్ అలీ పాకిస్తాన్ జట్టులో ఉన్నాడు. అతను రోజుకు 150 సిక్సర్లు కొట్టగలనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తన కెరీర్‌లో ఆ నైపుణ్యాన్ని పెద్దగా ప్రదర్శించలేకపోయాడు. ఈ కారణాల వల్ల జట్టు నుంచి పక్కన పెట్టారు.







