సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్‌లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీసీబీ ఫిర్యాదు, ఐసీసీ నిర్ణయం
ఈ సంఘటన తరువాత, పీసీబీ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. ఒకవేళ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే తాము టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే, ఐసీసీ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, యూఏఈతో మ్యాచ్‌కు ముందు పైక్రాఫ్ట్ పాకిస్తాన్ జట్టు కోచ్, కెప్టెన్ మరియు మేనేజర్‌తో మాట్లాడి, కరచాలనం ఘటన జరిగి ఉండకూడదని పేర్కొంటూ క్షమాపణలు చెప్పినట్లు పీసీబీ ఛీప్ మోసిన్ నఖ్వి తెలిపారు.
టోర్నీలో కొనసాగడానికి గల కారణాలు
టోర్నీ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాలను వివరిస్తూ నఖ్వి, క్రీడలు మరియు రాజకీయాలు ఒకదానితో ఒకటి కలవకూడదని తాము నమ్ముతున్నామని చెప్పారు. అంతేకాకుండా, టోర్నీని బహిష్కరించడం అనేది ఒక పెద్ద నిర్ణయం అవుతుందని, దీనికి ప్రధానితో సహా చాలా మంది మద్దతు తమకు ఉందని, ఇలాంటి ఘటన మారాలా రిపీట్ కాదని భావిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఆర్థిక నష్టాల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడిందనే అభిప్రాయం కూడా ఉంది. తీవ్ర నష్టాల్లో ఉన్న పీసీబీకి టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కీలకం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీలో కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







