తెలంగాణలో ముగ్గురు Ntv రిపోర్టర్ల అరెస్టు ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళా ఐఏఎస్ అధికారి (IAS Officer)పై వచ్చిన కథనం నేపథ్యంలో, ఎన్‌టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ (Donthu Ramesh), రిపోర్టర్లు పరిపూర్ణ చారి (Paripoorna Chary), సుధీర్ (Sudheer)లను సిట్ (SIT) అధికారులు అరెస్టు చేయడం పెద్ద దుమారమే రేపింది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
దొంతు రమేశ్ అరెస్టును అక్రమంగా నిర్వహించారంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)లో అధికారికంగా కేసు నమోదు అయ్యింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఈ విషయమై ఫిర్యాదు చేయగా, మీడియా వ్యక్తులపై దౌర్జన్యం జరిగిందన్న ఆరోపణలతో ఎన్‌హెచ్ఆర్‌సీ కేసును స్వీకరించింది. ఇది తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న చర్చలకు మరింత బలం చేకూర్చినట్లైంది.
సంబంధం లేని వార్తతో తనను లింక్ చేశారని రమేశ్ ఆరోపణలు
తన అరెస్టుపై దొంతు రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించారు. విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోతున్నాడన్న పోలీసుల వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. తనకు ఎలాంటి సంబంధం లేని ఓ వార్తా కథనానికి లింక్ పెట్టి, దాని ఆధారంగా తనను అరెస్టు చేశారని ఆరోపించారు.
దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యానికి సంబంధించిన వార్తల కవరేజ్ కోసం, అలాగే వ్యక్తిగత వెకేషన్ ట్రిప్ నిమిత్తం, తన భార్యతో కలిసి బ్యాంకాక్ మార్గంగా స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమయంలో పోలీసులు తనను అరెస్టు చేశారని వివరించారు.
అరెస్టు అనంతరం విచారణ పేరుతో తనకు ఏమాత్రం సంబంధం లేని అనేక ప్రశ్నలతో గంటల తరబడి వేధించారని రమేశ్ పేర్కొన్నారు. అక్రమ నిర్బంధ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ తాను చేయని తప్పుకు పాలకపక్షం పైశాచికం, అధికార యంత్రాంగం అణచివేత ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో, రాజకీయ భేదాలకు అతీతంగా స్పందించిన రాజకీయ పార్టీలు, మిత్రులు, జర్నలిస్టు సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వ్యవహారం మీడియా స్వేచ్ఛ, అధికార దుర్వినియోగం, మానవ హక్కుల పరిరక్షణ అంశాలపై మరింత పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.








