భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్ (Nithya Meenan), ఇప్పుడు ‘సార్ మేడమ్’ (Sir Madam) చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య, ప్రేమ, సంబంధాల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నిత్య మాట్లాడుతూ.. “ఒకప్పటి నా ఆలోచనలతో పోలిస్తే, ఇప్పుడు ప్రేమకు నా జీవితంలో అంత ప్రాధాన్యం లేదు. ప్రేమకు, సోల్‌మేట్‌కు మనం అవసరమని, లేకపోతే జీవితం అసంపూర్ణం అని అనుకునే రోజులు నాకు కూడా వచ్చాయి. అలాంటి వ్యక్తిని వెతికిన అనుభవం కూడా ఉంది. కానీ.. కాలక్రమేణా నాకు అర్థమైంది.. మన జీవితం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదని” అన్నారు.
ఒంటరిగా ఉండటం లోపం కాదని స్పష్టం చేస్తూ, “ఒక్కరే ఉండటం ఒక లోపం కాదు. రతన్ టాటా (Ratan Tata) కూడా పెళ్లి చేసుకోలేదు కదా! జీవితంలో పెళ్లి జరగకపోయినా మరేమీ ఉండదు. కొన్నిసార్లు తోడు లేదు అనే బాధ కలుగుతుంది, కానీ నేను ఈ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను” అని తెలిపారు.
తన జీవిత అనుభవాల గురించి ప్రస్తావిస్తూ, “జీవితంలో అనుభవించిన పాఠాల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఏదైనా జరిగితే అది మన మంచికే అనుకోవడం నేర్చుకున్నాను” అని నిత్యా మీనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.