రాజ్యసభలో రాజ్యంగంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రాల అభిప్రాయాల ప్రాధాన్యం
ఎంపీ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు ఈ పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకు ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఖచ్చితమైన చట్టాలు అవసరమవుతున్నాయి” అన్నారు.
ఆర్థిక అసమానతలు, న్యాయవ్యవస్థ సమస్యలు
ఆర్థిక అసమానతలు, ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సమస్యలు మరింత భారంగా మారుతున్నాయని ఎంపీ చెప్పారు. “రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పని భారం పెరిగింది, 141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ఈ పరిస్థితి మన దేశానికి అందుబాటులో ఉన్న న్యాయసేవలను ప్రభావితం చేస్తోంది” అని ఆయన అన్నారు.