లోకేష్ ఇలాకాలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని బలి

లోకేష్ ఇలాకాలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని బలి

ముఖ్య‌మంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రాతినిథ్యం వహిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటనలో ఓ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని (Female Student) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

స్థానికుల సమాచారం ప్రకారం, మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినిని, అదే కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న యర్రబానికి చెందిన రహీమ్ (Raheem) అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు కూడా చిత్రీకరించినట్లు స‌మాచారం.

కొంతకాలానికి రహీమ్ ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానించిన విద్యార్థిని అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆగ్రహించిన రహీమ్, ఆ విద్యార్థిని తనతో స‌న్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోను ఇతరులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు సమాచారం.

ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురైన విద్యార్థిని తాడేప‌ల్లి మండ‌లం పోల‌కంపాడులోని త‌న నివాసంలో శుక్రవారం సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్య‌మైన మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో, సీఎం క‌ర‌క‌ట్ట నివాసానికి కూత‌వేటు దూరంలోనే ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆడ‌వారి జోలికి వ‌స్తే ఊరుకునే స‌మ‌స్యే లేద‌న్న మంత్రి ఇలాకాలో విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి, ఆమె మ‌ర‌ణానికి కార‌ణం అవ్వ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌హిళా ర‌క్ష‌ణ వేదిక‌ల‌పై మాట్లాడేందుకేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

ప్రేమ పేరుతో మోసం చేసి, వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యువతలో సోషల్ మీడియా దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment