వైసీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తన కుమార్తె (Daughter)క్రాంతి బార్లపూడి (Kranti Barlapudi), అల్లుడు (Son-In-Law)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, రాజకీయ కుట్రల్లో భాగంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ కుటుంబంలో నెలకొన్న వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముద్రగడ మాట్లాడుతూ.. “మా కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోంది. మా కుటుంబంతో వారికి సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. నా చిన్న కొడుకు (Younger Son) గిరి (Giri) ఎదుగుదల చూసి వారు దారుణంగా ఏడుస్తున్నారు. నాకు కాన్సర్ (Cancer) వచ్చిందని, నా కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను. నా వియ్యంకుడు శివాజీతో మనస్పర్థలు తెచ్చేందుకు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నా మనవరాలిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నా మనవడిని కూడా రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతాను. ఎవరో ఏడుస్తున్నారని నేను రాజకీయాలు వదిలిపెట్టను” అని స్పష్టం చేశారు.
ముద్రగడ తన కుమార్తె, అల్లుడిపై తీవ్రంగా మండిపడ్డారు. “వీళ్లు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారని చెబుతున్నారు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. ఏడాది కాలంగా వీళ్లతో రాకపోకలు ఆగిపోయాయి. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తూ చీప్ పబ్లిసిటీ (Cheap Publicity) కోసం దిగజారుతున్నారు” అని విమర్శించారు. ఈ వివాదంపై ముద్రగడ కుమార్తె క్రాంతి బార్లపూడి గతంలో సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా తన తండ్రి కాన్సర్‌తో బాధపడుతున్నారని, సోదరుడు గిరి సరైన చికిత్స అందించడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలు వైరల్‌గా మారడంతో, ముద్రగడ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వొద్దు. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. సిగ్గు, లజ్జ ఉంటే ఇవాళ్టి నుంచి ఈ తప్పుడు ప్రచారం ఆపండి,” అని హెచ్చరించారు.
సూపర్ సిక్స్ అమలు చేయాలని సవాల్
అలాగే, రైల్వే కేసు (Railway Case) విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని ముద్రగడ ఆరోపించారు. “రైల్వే కేసును ప్రభుత్వం తిరగదోడుతుందని తెలిసిన వెంటనే, వీళ్లు కేసు నిలిపివేయించామని ప్రచారం చేయిస్తున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీలలో చేర్చే కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలను ముఖ్యమంత్రితో అమలు చేయించండి” అని సవాల్ విసిరారు. ముద్రగడ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నానని, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, తన కొడుకు, మనవరాలిని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని పునరుద్ఘాటించారు. “వీరు బెదిరిస్తే బెదిరిపోతానా? నేను అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కాపు సంఘాల కోసం పని చేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తాను,” అని అన్నారు.
ఈ వివాదం కాకినాడ జిల్లాలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించింది. ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో కీలకమైన కాపు ఉద్యమ నాయకుడిగా, వైఎస్ఆర్‌సీపీలో ప్రముఖ నేతగా ఉన్న నేపథ్యంలో, ఈ కుటుంబ వివాదం రాజకీయ కోణంలో విస్తృతంగా చర్చించబడుతోంది. కుమార్తె, అల్లుడి ఆరోపణలు, ముద్రగడ స్పందనలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులకు దారి తీసే అవకాశం ఉంది.







