కాపు ఉద్యమ నేత (Kapu Movement Leader), వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) (పద్మనాభరెడ్డి) ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు క్యాన్సర్ (Cancer) సోకినట్లు ఆయన కుమార్తె (Daughter) బార్లపూడి క్రాంతి (Barlapudi Kranti) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి మాట్లాడుతూ.. “నా తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. కానీ ఆయనకు తగిన వైద్యసహాయం అందించడం లేదు. నా సోదరుడు (Brother) ముద్రగడ గిరి (Mudragada Giri) తండ్రి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. నాన్నను కలవనీయకుండా దూరంగా ఉంచుతున్నారు. నాన్న దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ముద్రగడపై క్రాంతి విమర్శలు..
ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి.. ఆయన్ను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. వరుసగా వీడియోలు విడుదల చేస్తూ హడావిడి చేశారు క్రాంతి. తన తండ్రిని, తోబుట్టువుపై అనేక ఆరోపణలు చేస్తూ జనసేన పార్టీకి (Janasena Party) మద్దతుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియోలు(Videos) సంచలనంగా మారాయి. తన తండ్రిపై కేసు పెట్టిన పార్టీలకు మద్దతు ఇవ్వడంపై ముద్రగడ గిరి సైతం తన సోదరి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు.
తన కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సైతం స్పందించారు. జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, వెనక్కు తగ్గేదిలేదని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని అన్నారు. తన కూతురుతో కూడా తనపై తప్పుడు ప్రచారం చేయించారని, తన కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి తను తన ఆస్తి కాదని, తన కుమారుడు మాత్రమే తన ప్రాపర్టీ అని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.