ఏపీ బీజేపీలో ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మరొకరు దూషణలతో వార్తలకెక్కారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదం ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి అనుచరులు పేకాట క్లబ్ లు నడుపుతున్నారంటూ ఎస్పీకి సీఎం రమేశ్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎం రమేశ్ లేఖపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వాళ్లు తప్పు చేస్తే చెప్పుతో కొడతా.. లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొడతానని ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు లేఖలు ఎవడైనా రాస్తాడని, అనకాపల్లిలో ఉన్న సీఎం రమేశ్ కు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు.
సీఎం రమేశ్ లేఖ సినిమా కథలా ఉందంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సెటైర్లు వేశారు. అదానీ ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేశ్ పొందడంపై విమర్శలు చేశారు. గతంలో ఆ కాంట్రాక్టు తమకే కావాలని అదానీ సైట్ లోకి వెళ్లి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.