తెలంగాణలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ఎవరు ఏ విధంగా పనిచేస్తారో తనకు బాగా తెలుసు అని ఆమె పేర్కొన్నారు. “పని చేసే వాళ్లు ఎవరో, యాక్టింగ్ చేసే వాళ్లు ఎవరో తనకు స్పష్టంగా తెలుసు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్టీ లైన్ దాటిన వారిపై కఠిన చర్యలు
పార్టీ కోసం పూర్తిస్థాయిలో సమయం ఇవ్వాలని, అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించవద్దని నేతలకు మీనాక్షి నటరాజన్ సూచించారు. “నా పని తీరుతో ఎవరికైనా అభ్యంతరాలుంటే రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీకి ఫిర్యాదు చేయండి. కానీ, పార్టీ విషయాలను బయట మాట్లాడకండి” అంటూ ఆమె హెచ్చరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, గ్రూప్ రాజకీయాలు, బహిరంగ విమర్శలు పార్టీ పరువును దిగజారుస్తున్నాయి. పార్టీ లైన్ దాటి వ్యవహరించే ఏ నాయకుడిపైనైనా కఠినంగా వ్యవహరిస్తామని హైకమాండ్ ఇప్పటికే హెచ్చరించింది. తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత, మెదక్ పార్లమెంట్ సమావేశంలో కూడా నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్. “గొడవలు గాంధీ భవన్ గేటు దాటకూడదు. సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టులు పెడితే, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరు అయినా సరే ఇంటికి సాగనంపుతా” అని తేల్చి చెప్పారు.