కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధాని నరేంద్రమోడీని (Narendra Modi) ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. చెన్నైలో (Chennai) జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పార్టీ సమానత్వ సూత్రాలను నమ్మదన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అలాగే పెరియార్, అంబేద్కర్ (Ambedkar) ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా మండిపడ్డారు. అనంతరం తన వ్యాఖ్యలపై స్పష్టత ఇస్తూ, తాను మోడీని ఉగ్రవాది (Terrorist) అని అనలేదని, ప్రజలను భయపెడుతున్నారని మాత్రమే అన్నానని చెప్పారు. అన్నాడీఎంకే (AIADMK) వంటి పార్టీలు ఇలాంటి నాయకత్వంతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నాయో అర్థం కావడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఐటీ (IT Department), ఈడీ (ED) వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కులను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. మహిళలు, పేదల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








