మ‌ద్యం అమ్మ‌కాల్లో జోరు.. ఆదాయం ఏమైన‌ట్లు..?

మ‌ద్యం అమ్మ‌కాల్లో జోరు.. మరి ఆదాయం ఇంతేనా..?

కలెక్టర్ల కాన్ఫ‌రెన్స్‌ సాక్షిగా సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) విష ప్రచారాలు బ‌ద్ధ‌ల‌య్యాయని వైసీపీ(YSRCP) తీవ్రంగా విమర్శిస్తోంది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై బ‌నాయించిన‌ లిక్కర్‌ కేసు అక్రమమని, ఆ వాదనలకు బలం చేకూర్చేలా అధికారులే డేటా విడుదల చేయడం గమనార్హం. మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వం చేపట్టడం వల్ల ఖజానాకు దాదాపు లక్ష కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు సహా టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే కూట‌మి ప్ర‌భుత్వంలో కొత్త మద్యం పాలసీ (New Liquor Policy) తీసుకొచ్చినప్పటికీ ఆదాయాల్లో ఎలాంటి గణనీయ వృద్ధి కనిపించలేదని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ (Collectors Conference) వివరాలు చెబుతున్నాయి.

మ‌ద్యం ఆదాయం.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ
చంద్రబాబు పాలన 2014-19 మధ్య కాలంతో పోలిస్తే, కోవిడ్‌ సంక్షోభం, మద్యం నియంత్రణ వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో మద్యం ఆదాయాలు (Revenues) గణనీయంగా పెరిగినట్టుగా రికార్డులు చూపుతున్నాయి. కూట‌మి పాల‌న‌లో 2024 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మద్యం ఆదాయం పన్నులతో కలిపి రూ.10,604 కోట్లు కాగా, 2025లో అదే కాలంలో లైసెన్స్ ఫీజు, పన్నులు కలిపి రూ.11,775 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే వృద్ధి కేవలం 11.05 శాతం మాత్రమే. ఇందులో ప్రైవేటు దుకాణాలు చెల్లించిన లైసెన్స్ ఫీజే రూ.1,797 కోట్లు కావడం గమనించదగ్గ అంశం.

క‌నిపించ‌ని వృద్ధి..?
వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూట‌మి హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టూరిజం (Tourism) పేరుతో, మార్టుల (Marts) పేరుతో దుకాణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో బెల్టుషాపులు తిరిగి పెరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ బెల్టుషాపులకు వేలంపాటలూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఇంటింటికీ మద్యం సరఫరా వాట్సాప్‌ ద్వారా ఉద్ధృతంగా సాగుతోందని, పర్మిట్ రూములు, అర్ధరాత్రి తర్వాత కూడా మద్యం విక్రయాలు ఆగకపోవడం పరిస్థితిని చూపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థాయిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరిగితే ఆదాయాల్లో మరింత వృద్ధి కనబడాలి కదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వాస్తవానికి కేవలం 11 శాతం వృద్ధి మాత్రమే వచ్చింది. సాధారణంగా ప్రతీ ఏటా 10 శాతం వృద్ధి సహజం అన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అటువంటి పరిస్థితిలో కొత్త పాలసీతో చంద్రబాబు ప్రభుత్వం ఏ ప్రయోజనం సాధించిందని ప్రశ్నిస్తున్నారు.

రూ.99 మ‌ద్యం సూప‌ర్ ఫ్లాప్‌
మరోవైపు రూ.99ల మద్యం కూడా సూపర్ ఫ్లాప్ అయ్యిందని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా చీప్ లిక్కర్ వినియోగం మొత్తం విక్రయాల్లో 60 నుంచి 70 శాతం ఉండగా, రూ.99ల మద్యం వినియోగం కేవలం 18 శాతం మాత్రమే ఉందని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. దీంతో చంద్రబాబు (Chandrababu), టీడీపీ(TDP) చేస్తున్న ప్రచారం వట్టి వాదనలేనని తేలిపోయింది.

ఇది అంతా చంద్రబాబు లెక్కల ఆధారంగా బయటపడిన సమాచారమని అధికారులు చెబుతున్నారు. కాగ్‌ (CAG) పరిశీలన, మదింపు తర్వాత ఈ నంబర్లు కూడా మరింత తగ్గే అవకాశం ఉందని సూచించారు. మొత్తం మీద, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడి అయిన డేటా, వివరాలు చంద్రబాబు విషప్రచారాలను పూర్తిగా బద్దలుకొట్టాయని వైసీపీ ధ్వజమెత్తుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment