‘కుబేర’ రిలీజ్.. ఏపీ లో హైక్, తెలంగాణలో నో ఛేంజ్

నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన ‘కుబేర’ (Kubera) చిత్రం ఈ శుక్రవారం (జూన్ 20) విడుదల కానుంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ‘కుబేర’ సినిమా టికెట్ ధరల (Ticket Prices) పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీలోని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ.75 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి పది రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

మరోవైపు, తెలంగాణ (Telangana)లో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమై చిత్ర బృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి.

భారీ రన్‌టైమ్
‘కుబేర’ మూవీ రన్‌టైమ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. బోర్డు సూచనల మేరకు మార్పు చేర్పులు చేసిన తర్వాత 182 నిమిషాల 38 సెకన్ల నిడివితో ‘కుబేర’ థియేటర్లలో విడుదల కానుంది. అంటే 3 గంటల 2 నిమిషాలకు పైనే సినిమా నిడివి ఉండటం గమనార్హం. ఇప్పటివరకు అగ్ర కథానాయకులు నటించిన భారీ విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రాలు మాత్రమే 3 గంటలకు పైన రన్‌టైమ్ కలిగి ఉన్నాయి. ఒక సోషల్ డ్రామా ఈ స్థాయిలో రన్‌టైమ్ కలిగి ఉండటం సినిమా కంటెంట్‌పై టీమ్‌కు ఉన్న నమ్మకాన్ని చెప్పకనే చెబుతోంది.

మూడు గంటల పాటు శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, తెలుగు, తమిళ వెర్షన్ రన్‌టైమ్‌లో స్వల్ప మార్పు ఉంది. తెలుగులో ఒక నిమిషం నిడివి తక్కువతో థియేటర్‌లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు. సాంకేతికంగా ఏర్పడిన సమస్య కారణంగా అలా కట్ చేయాల్సి వచ్చిందని, ఈ మార్పు కథపరంగా ఎలాంటి ప్రభావం చూపదని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment