ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ మార్పుతో రైతులకు తీవ్ర నష్టం: కేటీఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ మార్పుతో రైతులకు తీవ్ర నష్టం: కేటీఆర్

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా మరిచిపోయారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల బాధితులు కేటీఆర్‌ను కలిశారు.

బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది” అని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు నేరుగా రైతులతో చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాలు చూపించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ అలైన్‌మెంట్లను మార్చి పేదలు, రైతుల జీవితాలను అగంచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌లో లేవనెత్తుతాం

ట్రిపుల్ ఆర్‌ అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న వారికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌లో కూడా లేవనెత్తుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలైన్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు రైతుల పక్షాన పోరాడుతామని చెప్పారు. బాధితులు ఐకమత్యంతో పోరాడాలని, గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయని సూచించారు. తెలంగాణ భవన్‌ను ‘జనతా గ్యారేజ్’ అని అభివర్ణిస్తూ, రైతులు ఎప్పుడైనా వచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment