సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్: రాహుల్ గాంధీకి సవాల్!

సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్: రాహుల్ గాంధీకి సవాల్!

ఎమ్మెల్యేల (MLAs’) ఫిరాయింపుల (Defections) అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఆయన X (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. “కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

గత ఎన్నికల సందర్భంగా ‘పాంచ్ న్యాయ్’ (Panch Nyay) పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తిస్తుందని చెప్పిన రాహుల్ గాంధీ (Rahul Gandhi).. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలని, “దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలి” అంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.

“రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ తరఫున ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment