జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (By-Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని తమ నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ చెబుతారని గుర్తుచేస్తూ, ఈ ఫలితం కొంత నిరుత్సాహాన్ని కలిగించినా, తాము ఏమాత్రం కృంగిపోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన తమ అభ్యర్థి తరఫున కష్టపడిన 407 బూత్‌ల లోకల్ నాయకులకు, తమ కొత్త అభ్యర్థి పోరాటానికి, అలాగే తమకు ఓటు వేసిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “ప్రతి సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినా, చివరి మూడు రోజుల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ఫలితం కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలకు అర్థమైందనే విషయాన్ని తెలియజేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ఎన్నికల ఫలితాలను ఉదహరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 7 ఉప ఎన్నికల్లో 5 చోట్ల గెలిచామని, కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తుచేశారు. అంతేకాక, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచినా, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిందని ఉదహరిస్తూ, ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కామన్ అని ఆయన తేల్చిచెప్పారు.








