కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, మునుగోడు ప్రజలే ముఖ్యమని, అందుకే అక్కడి నుంచే బరిలోకి దిగానని స్పష్టం చేశారు.
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నన్ను ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమన్నారు. పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఉన్నారని ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమని చెప్పారు. మంత్రి పదవి కాదు, మునుగోడు ప్రజలు ముఖ్యమని ఇక్కడి నుంచి బరిలోకి దిగాను” అని అన్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులు ఓడిపోయారని, తనను మునుగోడు ప్రజలు ఆశీర్వదించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్ఎస్ కాదని, కమ్యూనిస్టులే అని ఆయన చెప్పుకొచ్చారు. “మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నైతిక విజయం నాదే. ఉప ఎన్నికల్లో నన్ను ఓడించింది బీఆర్ఎస్ కాదు.. కమ్యూనిస్టులు. ఆనాడు కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం వల్లే ఓడిపోయా” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.