కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్.. ఉత్తర కొరియా ఫొటోలతో కొత్త చర్చ!

కిమ్ కుమార్తె లగ్జరీ లైఫ్.. ఉత్తర కొరియా ఫొటోలతో కొత్త చర్చ!

Summarize with AI

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. చైనా సరిహద్దుకు (China Border) సమీపంలోని సమ్జియోన్ (Samjiyon) పర్యాటక ప్రాంతంలో నిర్మిస్తున్న స్కీ రిసార్ట్‌ను (Ski Resort) కిమ్ జోంగ్ ఉన్ తన భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్ జు ఏతో(Kim Ju Ae) కలిసి సందర్శించారు. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగిన ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసింది.

అయితే ఈ ఫొటోల్లో అందరి దృష్టిని ఆకర్షించింది కిమ్ కుమార్తె జు ఏ స్కీయింగ్ చేస్తున్న దృశ్యాలే. ఆమె ఉపయోగించిన స్కీయింగ్ పరికరాలు. జు ఏ ఉపయోగించిన స్కిస్‌పై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ‘Stöckli’ లోగో కనిపించింది. ఈ బ్రాండ్‌కు చెందిన స్కిస్ ధరలు సాధారణంగా వెయ్యి యూరోలకు పైగా ఉంటాయి. అంతేకాదు, కిమ్ వెంట ఉన్న సీనియర్ అధికారి పార్క్ జోంగ్ చోన్ ధరించిన స్కీ బూట్లు ఆస్ట్రియాకు చెందిన ‘Fischer’ బ్రాండ్‌విగా గుర్తించారు.

ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్లో లగ్జరీ వస్తువుల సరఫరాపై నిషేధం కూడా ఉండటంతో ఈ విదేశీ బ్రాండ్ల వినియోగం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి ఖరీదైన వస్తువులు ఉత్తర కొరియాకు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరికరాలను ఎప్పుడు, ఏ మార్గంలో తీసుకొచ్చారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

మరోవైపు సమ్జియోన్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కిమ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ పోతే ప్రాంతంలో స్కీ రిసార్ట్, ఆధునిక హోటళ్లు, పర్యాటక సదుపాయాల అభివృద్ధి పనులను కిమ్ పరిశీలించారు. అలాగే మౌంట్ పెక్టు పర్వత ప్రాంతానికి వెళ్లే మార్గాల విస్తరణ, సమ్జియోన్ విమానాశ్రయ ఆధునికీకరణపై అధికారులకు సూచనలు చేశారు. విమానాశ్రయ రన్‌వేను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో అభివృద్ధి పనుల కంటే కిమ్ కుమార్తె స్కీయింగ్, ఆమె ఉపయోగించిన ఖరీదైన స్విస్ స్కిస్, విదేశీ బ్రాండ్ల పరికరాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు కారణమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment