కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో దారుణమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల సహకారంతో, దాదాపు 50 మంది పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు వెల్లడయ్యాయి. కళ్యాణ్ చక్రవర్తి పారా మెడికల్ విద్యార్థినుల శరీర భాగాల ఫొటోలను సెల్ఫోన్లో తీసి, వాటిని వారికే పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
కళ్యాణ్ చక్రవర్తి, తన సహచర ల్యాబ్ టెక్నీషియన్లతో కలిసి, విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా, వారి కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత విద్యార్థినులు ఆరోపించారు. ఈ వేధింపులు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయని, చివరకు భరించలేక విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటై, బాధిత విద్యార్థినులను విచారించింది. కళ్యాణ్ చక్రవర్తితో పాటు సహకరించిన టెక్నీషియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశాయి.
విద్యార్థులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలను అసభ్యకరంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని విద్యార్థినులు తీవ్రంగా మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థినుల భద్రత కరువైందనే ఆరోపణలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఇటువంటి దారుణ ఘటనలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో విద్యా సంస్థల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర చర్చకు దారితీసింది, బాధిత విద్యార్థినులకు న్యాయం జరగాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.








