తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే కడప (Kadapa) రెడ్డప్పగారి (Reddappa Gari) మాధవీరెడ్డి (Madhavi Reddy)కి సొంత పార్టీ నేతల నుంచి మరోసారి నిరసన సెగ తగిలింది. ఇటీవల పార్టీలో తమకు విలువలేదంటూ కొందరు నేతలు మాధవీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టగా, తాజాగా కడప ముస్లిం మైనార్టీ నాయకులు తమను కించపరుస్తున్నారంటూ రోడ్డెక్కారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించమని ప్రార్థించారు. అనంతరం మీడియా ఎదుటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడ్డ వారిని పూర్తిగా పక్కనబెట్టిందంటూ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. “సీనియర్లు లేరు… తోక్కా లేదంటూ” ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులురెడ్డి (Srinivasulu Reddy) చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడంపై, అలాగే మైనార్టీ వర్గాలకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అన్నీ తమ కుటుంబ పెత్తనమే… ఇతరులను పట్టించుకోవడం లేదు” అంటూ మాధవిరెడ్డి కుటుంబంపై బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే దేవుని కడప కార్యకర్తల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాధవిరెడ్డి, ఇప్పుడు ముస్లిం మైనార్టీ (Muslim Minority) నేతల(Leaders) అసంతృప్తితో కొత్త సమస్యలో చిక్కుకున్నారు. కమలాపురం నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి చుట్టూ తిరుగుబాటు వర్గం గూడుకట్టిందని సమాచారం. పార్టీ కష్టకాలంలో తాము చేసిన సేవలు పూర్తిగా విస్మరించబడినట్లుగా భావిస్తూ, సీనియర్ నేతలు పుత్తా నరసింహారెడ్డిని కలిసి పార్టీ భవిష్యత్తుపై చర్చించారు.
రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడం, సీనియర్లతో పాటు మైనార్టీ నేతల అసంతృప్తి పెరగడంతో, కడప టీడీపీ అంతర్గతంగా చీలికలు స్పష్టమవుతున్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి ఒంటెద్దు పోకడలోనే పార్టీని నడిపిస్తున్నారని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కడప టీడీపీ భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.








‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు