ఖాజీపేటలో విద్యార్థిని రామకీర్తనను అతికిరాతకంగా గొంతుకోసి చంపిన కేసులో ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం నిందితుడిని మైదుకూరు నుంచి తరలిస్తుండగా, బాసాపురం చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వెంకటేష్ యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అసలేం జరిగింది?
నిందితుడు వెంకటేష్ పోలీసుల అదుపు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తనను అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై భౌతిక దాడికి దిగాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. నిందితుడు హింసాత్మకంగా ప్రవర్తించడంతో, సీఐ వంశీధర్ అప్రమత్తమై ఆత్మరక్షణ కోసం తన సర్వీసు రివాల్వర్‌తో వెంకటేష్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతడికి వైద్యం అందుతోంది.
ప్రేమ నిరాకరించిందని ఘాతుకం
కడప జిల్లా ఖాజీపేట మండలం ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్.. అదే మండలం ఖాజీపేట అగ్రహారానికి చెందిన రామకీర్తనను కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని పదే పదే ఒత్తిడి చేసేవాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. రామకీర్తన (16) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి చొరబడిన వెంకటేష్, పెళ్లి విషయంపై మళ్ళీ గొడవ పడ్డాడు. ఆమె మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుమార్తెను తండ్రి శ్రీనివాసులు కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమధ్యలో చెన్నూరు వద్ద రామకీర్తన ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు తనపై దాడి చేసింది వెంకటేష్, ప్రవీణ్ అని తండ్రికి చెప్పడం కలచివేసింది.
ఉద్రిక్తతకు దారితీసిన ఘటన
రామకీర్తన హత్యతో ఖాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో కూడా నిర్వహించారు. తాజాగా జరిగిన కాల్పుల ఘటనతో పోలీసులు నిందితుడిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకున్నట్లయింది. ఈ కేసులో మరో నిందితుడు ప్రవీణ్ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.








