బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. త్వరలోనే కొత్త పార్టీ

బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. త్వరలోనే కొత్త పార్టీ

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. అన్నామలై తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించగా, దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో అన్నామలై త్వరలోనే తమిళనాడులో సొంతంగా ఒక సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు స్పష్టమైంది.

గత కొంతకాలంగా తమిళనాడు బీజేపీలో అన్నామలై ఒంటరయ్యారనే టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK)తో పొత్తు పెట్టుకున్న బీజేపీ అధిష్ఠానం.. సీట్ల సర్దుబాటులో భాగంగా అన్నామలై వ్యూహాలను పక్కనబెట్టింది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో నిత్యం రీల్స్, వీడియోలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అన్నామలైకు ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు సీటు కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన, జాతీయ పార్టీలో ఉంటే ప్రాంతీయంగా ఎదగడానికి పరిమితులు ఉంటాయని భావించి బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు.

రాజీనామా ఆమోదం పొందిన అనంతరం అన్నామలై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో, అభిమానులతో నేరుగా ముఖాముఖి మాట్లాడబోతున్నట్లు ప్రకటించారు. తన మనసులోని మాటను పంచుకుంటానని, తన తదుపరి రాజకీయ ప్రయాణం, కొత్త పార్టీ స్థాపన, భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి వివరాలను రేపటి లైవ్‌లో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

కొత్త పార్టీ పెట్టడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీ చేయడానికి అన్నామలై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఇప్పటికే సినిమా నటుడు విజయ్ పెట్టిన ‘టీవీకే’ (TVK) పార్టీ సంచలనంగా మారగా, ఇప్పుడు అన్నామలై కూడా సొంత కుంపటి పెట్టాలని నిర్ణయించుకోవడం ద్రావిడ రాజకీయాల్లో సరికొత్త రసవత్తర పోరుకు దారితీయనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment