జనసేన సభ్యత్వ నమోదు పొడిగింపు.. కారణం ఇదే

జనసేన సభ్యత్వ నమోదు పొడిగింపు.. కారణం ఇదే

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన ఆశించిన స్థాయిలో అంద‌డం లేదా..? శివ‌రాత్రి రోజున మొదలుపెట్టిన ఈ కార్యక్ర‌మం ఇంకా 20 మార్క్ దాట‌క‌పోవ‌డం కార‌ణం ఏంటీ..? అనూహ్యంగా జ‌న‌సేన స‌భ్య‌త్వ న‌మోదు గ‌డుపు పెంచ‌డంపై అనేక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. సభ్యత్వ నమోదు గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించడంపై చ‌ర్చ మొద‌లైంది.

గత నెల రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై అచంచల విశ్వాసానికి ఈ సంఖ్యే నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి ఉన్నప్పటికీ సాంకేతిక ఇబ్బందులు, సమయాభావం, స్థానిక పరిస్థితుల వల్ల నమోదు చేసుకోలేకపోయామని పార్టీకి విజ్ఞ‌ప్తులు అంద‌డంతోనే గ‌డువు పెంచుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

రాజకీయ వ్యవస్థలో మార్పు కోరుకునే వారు, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పనిచేసే జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని పార్టీ కోరుతోంది. నెల రోజులు అయినా 20 ల‌క్ష‌ల మార్క్ దాట‌క‌పోవ‌డంతోనే స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని పొడిగించార‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. అధిష్టానం విధించిన టార్గెట్‌ను రీచ్ కావ‌డం కోసం మ‌రోసారి ప్ర‌య‌త్నం మొద‌లుపెట్ట‌నున్నారు.

ఈ సభ్యత్వ నమోదులో 60 శాతం కంటే ఎక్కువ మంది యువత ఉండటం గమనార్హం, వీరిలో ఓటు హ‌క్కు లేని చిన్నారులు సైతం ఉన్నార‌ని తెలుస్తోంది. 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీలు, 6 శాతం ఓటు బ్యాంక్ ఉన్న జ‌న‌సేన పార్టీకి కేవ‌లం 20 ల‌క్ష‌లు మాత్ర‌మే స‌భ్య‌త్వాలు రావ‌డంపై పార్టీ కూడా ఆలోచ‌న‌ల్లో ప‌డింది. స‌భ్య‌త్వ న‌మోదును ప్ర‌జాప్ర‌తినిధులు, అగ్ర నాయ‌క‌త్వం సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. అది బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌నే, మ‌రోసారి గ‌డువు పొడిగించార‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment