తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు అనే ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది.
ఈ అక్రమ తవ్వకాల్లో రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు నేరుగా పాలుపంచుకుంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వారి చర్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శ్రేణులు మరియు గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించారు.
తహసీల్దార్ మరియు మైనింగ్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, అక్కడ ఉన్న 19 లారీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే రాజానగరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు మరియు మైనింగ్ అధికారులు 19 మట్టి లారీలను సీజ్ చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమ తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం వచ్చినప్పటికీ, తాజాగా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు స్పందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గుట్టుగా సాగుతున్న అక్రమాలు ఇప్పుడు అధికారుల జోక్యంతో బట్టబయలయ్యాయి.







