కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కూటమి బూత్ కన్వీనర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ మంత్రి అచ్చెన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
అచ్చెన్న ప్రసంగం జనసైనికులకు కోపం తెప్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు ప్రస్తావించడం లేదని మంత్రిని నిలదీశారు. తమ నాయకుడి పేరు పలకడానికి వచ్చిన ఇబ్బందేంటని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా?” అంటూ నినాదాలు చేశారు.
బూత్ కన్వీనర్ల సమావేశంలో జనసైనికులు నిరసన తెలపడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తలను టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జనసేన నేతలను కూల్ చేసేందుకు పవన్ లేకపోతే ఎన్డీయే లేదని వ్యాఖ్యానించినప్పటికీ.. జనసైనికుల్లో ఆగ్రహం చల్లారలేదు. దీంతో మంత్రి అచ్చెన్న సమావేశాన్ని తొందరగా ముగించుకొని వెళ్లిపోయారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’