జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హోదా కల్పించే ముందు అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దాడిని కూడా ప్రస్తావించింది.
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పహల్గామ్‌లో జరిగిన దుర్ఘటన వంటి వాస్తవాలను విస్మరించలేమని కోర్టు పేర్కొంది.
గతేడాది విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్ మరియు సామాజిక కార్యకర్త ఖుర్షీద్ అహ్మద్ మాలిక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణలో జాప్యం జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం దెబ్బతింటుందని, ఇది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా లేకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిందని వారు తమ పిటిషన్‌లో వివరించారు.