టీడీపీ అనుకూల మీడియా ఎంతటి విషయాన్ని అయినా తారుమారు చేసి చూపగలదని, “నందిని పందిని చేయగలదు’’ అని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా యాజమాన్యాలు నిపుణులని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ, దాని అనుబంధ మీడియా వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో తనకు మంచి స్నేహం ఉందని, అనేక విషయాల్లో ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ఇప్పుడు రఘురామపై మాట్లాడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇబ్బందిగా ఉందని శ్రవణ్ కుమార్ అన్నారు.
డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజు DOPTకి PV సునీల్ కుమార్‌పై లేఖ రాశారని, IAS చట్టంలోని నాలుగు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ విధుల నుంచి తొలగించాలన్న అభ్యర్థన రఘురామ లేఖలో ఉందని తెలిపారు. PV సునీల్ కుమార్‌పై టీడీపీ నేతలు, అనుబంధ మీడియా నిన్నటి నుండి మాటల దాడి చేస్తున్నారని శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి నుండి రఘురామకృష్ణరాజును తొలగించాలని గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు జడ శ్రవణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టి రఘురామను తొలగించాల్సిన బాధ్యత ఉందన్నారు. అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని, రఘురామ వెనక్కి తగ్గకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను మూసివేస్తున్న వ్యవహారాన్ని కూడా శ్రవణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఫైబర్ నెట్, లిక్కర్ కేసుల్లో చంద్రబాబుపై ఉన్న కేసులను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉన్న కేసులు కూడా సైలెంట్‌గా ఉపసంహరించుకున్నప్పటికీ అమరావతి రైతులు, తనలాంటి కార్యకర్తలపై కేసులు మాత్రం మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై మూసివేసిన కేసులను తిరిగి రీ-ఓపెన్ చేసేలా తమ పార్టీ పోరాటం చేస్తుందని శ్రవణ్ కుమార్ ప్రకటించారు.








“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు