భారతదేశం (India)లో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల (Active COVID Case) సంఖ్య 4,026కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 268 కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించారు. ఈ సంఖ్య మే 22న 257 యాక్టివ్ కేసులుగా ఉండగా, కేవలం రెండు వారాల్లోనే కేసుల సంఖ్య వేలల్లో పెరిగి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్రాల వారీగా కేసులు
కేరళ (Kerala) రాష్ట్రం అత్యధిక కేసులతో (1,435) మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (Maharashtra) (506), ఢిల్లీ (Delhi) (483), గుజరాత్ (Gujarat) (338), బెంగాల్ (Bengal) (331) రాష్ట్రాలు గణనీయమైన కేసులను నమోదు చేశాయి. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక (Karnataka) (253), తమిళనాడు (Tamil Nadu) (189), ఉత్తరప్రదేశ్ (157) ఉన్నాయి. గత 24 గంటల్లో ఐదు కొవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరు, బెంగాల్‌లో ఒకరు, తమిళనాడులో ఒకరు మరణించారు. ఈ మరణాల్లో చాలావరకు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, న్యూమోనియా వంటివి ఉన్న వృద్ధులు ఉన్నారు.
కొత్త వేరియంట్‌లు, జాగ్రత్తలు
ఈ తాజా విజృంభణకు కారణం ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ (Omicron Subvariant) NB.1.8.1, ఇది అధిక సంక్రమణ రేటును కలిగి ఉందని నిపుణులు తెలిపారు. వ్యాక్సిన్‌ల నుంచి రోగనిరోధక శక్తి తగ్గడం, జనం జాగ్రత్తలు పాటించకపోవడం, వాతావరణ మార్పులు కూడా ఈ పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో తగినంత బెడ్‌లు, ఆక్సిజన్ సరఫరా, మెడిసిన్ సిద్ధంగా ఉంచాలని సూచిస్తున్నాయి. కర్ణాటకలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆరోగ్య నిపుణుల సలహా
ఆరోగ్య నిపుణులు ప్రజలు మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్‌లు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలను అనుసరించాలని సూచిస్తున్నారు. చాలా కేసులు స్వల్పంగా ఉన్నప్పటికీ, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.