కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఘోర వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో నేడు లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర అల్లాడుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ఇది ప్రకృతో, కాలమో తెచ్చిన కరువు కాదని, కేవలం రేవంత్ రెడ్డి మార్క్ నిర్వహణా లోపం వల్ల సంభవించిన “కాంగ్రెస్ కృత్రిమ కరువు” అని దుయ్యబట్టారు.
ఎల్నినో ప్రభావంతో నీటి, విద్యుత్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. సకాలంలో సమీక్షలు నిర్వహించకపోవడంతో పలు జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తాయని, రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ కోతలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు, ఇన్వెర్టర్లపై ఆధారపడాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బెదిరించడం సరికాదని, బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే మల్లన్న సాగర్ను నింపలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని హరీష్ రావు ఆరోపించారు. నీటిని వినియోగించి ఉంటే సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలు కరువు పరిస్థితులపై చర్యలు తీసుకుంటున్నాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కనీసం రాబోయే 20 రోజులైనా రైతులకు నిరంతరాయంగా, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని, తక్షణమే కరువు మండలాలను ప్రకటించి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








