RCB తో జరిగిన మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్ (Mumbai Indians) ఓటమిపై కెప్టెన్ హర్ధిక్ పాండ్యా (Hardik Pandya) స్పష్టంగా స్పందించాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం చెత్త ప్రణాళికలేనని చెప్పాడు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం, బౌలింగ్‌లో అధిక పరుగులు ఇవ్వడం జట్టును వెనక్కి నెట్టాయని పేర్కొన్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ముందుండి గేమ్‌ను నడిపించలేకపోతున్నామని, ఎప్పుడూ వెనుకబడిన పరిస్థితి నుంచి పోరాడాల్సి వస్తోందని చెప్పాడు. జట్టు ప్రదర్శనపై పూర్తిగా ఆలోచించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం వచ్చిన విరామాన్ని ఉపయోగించుకుంటామని వివరించాడు.
అదేవిధంగా టాస్, పిచ్ పరిస్థితులపై కూడా హార్దిక్ స్పందించాడు. టాస్ గెలిచినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే కొత్త వ్యూహాలను ప్రయత్నించాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. పవర్‌ప్లేలోనే (Powerplay) జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ వెనుకబడుతోందని, అక్కడే మ్యాచ్‌పై పట్టును కోల్పోతున్నామని చెప్పాడు. షెర్ ఫేన్ రూధర్ ఫోర్డ్ (Sherfane Rutherford) ప్రదర్శన జట్టుకు కొంత ధైర్యాన్ని ఇచ్చిందని ప్రశంసించాడు. అవసరమైతే జట్టులో మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని హార్దిక్ స్పష్టం చేశాడు.








