కన్న కూతురు (Daughter) బతికుందో.. చనిపోయిందో కూడా తెలియక దివ్యాంగ తండ్రి(Father) గుండెలవిసేలా వేడుకుంటున్న ఘటన గుంటూరు జిల్లాలో హృదయాలను కలిచివేస్తోంది. గుంటూరు జిల్లా ఆర్. ఆగ్రహారం ప్రాంతానికి చెందిన ఏసోబు (Yesobu) అనే దివ్యాంగుడు, తన 15 ఏళ్ల కూతురు ఏడాది క్రితం అదృశ్యమైందని (Missing) పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు నడవలేని పరిస్థితిలోనూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా స్పందన లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
2025 ఫిబ్రవరిలో తన కూతురు కనిపించడం లేదని గుంటూరు పోలీసులకు (Guntur Police) ఫిర్యాదు చేసిన ఏసోబు, అప్పటి నుంచి కేసు అటే నిలిచిపోయిందని ఆరోపిస్తున్నాడు. ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత ఒక కొత్త ఫోన్ నంబర్ నుంచి తన కూతురు కాల్ చేసిందని చెబుతున్నాడు. ఆ కాల్‌లో సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నానని చెప్పిన ఆమె, మాట్లాడుతుండగానే ఎవరో ఫోన్ కట్ చేశారని తెలిపాడు. ఈ కీలక సమాచారాన్ని పోలీసులకు అందించినా, వారు పట్టించుకోలేదని వాపోతున్నాడు.
ఇది చాలదన్నట్లు, మరికొన్ని రోజుల తర్వాత అదే నంబర్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చి “మీ అమ్మాయి చనిపోయింది” అని చెప్పారని ఏసోబు కన్నీటితో వివరించాడు. ఆ నంబర్‌ను పోలీసులకు ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. కనీసం ఆ కాల్ ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నం కూడా జరగలేదని ఆరోపిస్తున్నాడు.
తనకు కూతురు బతికుందో.. చనిపోయిందో కూడా తెలియని నరకయాత అనుభవిస్తున్నానని, ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిజాన్ని వెలికి తీయాలని ఏసోబు వేడుకుంటున్నాడు. “నాకు న్యాయం కావాలి కాదు… నా బిడ్డ బతికుందో లేదో ఒక మాట చెప్పండి” అంటూ పోలీసుల ముందు చేతులు జోడిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దివ్యాంగ తండ్రి ఆవేదన సమాజాన్ని కలచివేస్తోంది.








