కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) సాక్షిగా కృష్ణా జిల్లా గుడివాడలో(Gudivada) ఘోరమైన మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని (Gold Crown) ఆలయ కమిటీ సభ్యులే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టేసి సొమ్ము చేసుకున్నారు. భక్తుల నమ్మకాన్ని, ఆలయ పవిత్రతను బూడిద పాలు చేసిన ఈ ఉదంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
70 లక్షల కిరీటం.. 38 లక్షలకు తాకట్టు!
ఆర్యవైశ్య కళ్యాణమండప కమిటీ (Arya Vysya Kalyanamandapam Committee) ఆధ్వర్యంలో నడుస్తున్న గుడివాడలోని (Gudivada) శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఘరానా మోసం జరిగింది. 2025 జనవరిలో మాటూరి సుబ్బారావు(Maturi Subbarao), లక్ష్మీ కుమారి (Lakshmi Kumari) అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవుడికి అర్పించాలనుకున్నారు. ఏడుకొండలకు ప్రతీకగా ఎన్నో ప్రత్యేకతలతో, వజ్రాలు అద్ది సుమారు 461 గ్రాముల బరువుతో ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అందరి సమక్షంలో పెద్ద వేడుక నిర్వహించి స్వామివారికి సమర్పించారు. అప్పట్లో దీని తయారీకి రూ. 70 లక్షలు ఖర్చు అవ్వగా.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ రూ. కోటి పైనే ఉంటుంది.
అయితే, దేవస్థానం కమిటీ అధ్యక్షుడు మోహనరావుతో(Mohan Rao) పాటు కొందరు సభ్యులు కలిసి, ఆ కిరీటాన్ని(Golden Crown) పట్టణంలోని ఒక మార్వాడీ దుకాణంలో(Marwadi Shop) కేవలం రూ. 38 లక్షలకే తాకట్టు పెట్టేశారు(Mortgaged). భక్తులు ఇచ్చిన కానుకలను దేవుడికి అలంకరించకుండా, వాటితో సొంత వ్యాపారాలు, అవసరాలు తీర్చుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
81 ఏళ్ల వయసులో ఈ మోసాన్ని తట్టుకోలేకపోతున్నానని దాత సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. కిరీటం ఇచ్చినప్పుడు తమకు కనీసం రసీదు కూడా ఇవ్వలేదని, స్వామివారికి అలంకరిస్తారని నమ్మామని కన్నీరు పెట్టుకున్నారు. “మా కిరీటం మాకు తిరిగి ఇప్పించేస్తే.. ఇలాంటి దొంగలు ఉండే గుడిలో కాకుండా, బాధ్యత గల మేనేజ్‌మెంట్ ఉన్న వేరే మంచి గుడికి ఇచ్చేస్తాం. మీడియా అయినా మాకు న్యాయం చేయాలి” అని దాత కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దేవాదాయ శాఖ
ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ తీవ్రంగా స్పందించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (AC) లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో అర్చకుడి నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు కోసం దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయ తాళాలు తెరిపించి రికార్డులను పరిశీలించాలని భావించారు.
అయితే, ఏసీ లలిత (Lalitha) రాకను ముందే పసిగట్టిన ట్రస్ట్ బోర్డులోని మొత్తం 31 మంది సభ్యులూ ఆఫీసుకు తాళాలు వేసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని పరారయ్యారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఒక్క సభ్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై ఏసీ లలిత తీవ్ర ఆగ్రహం మరియు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె దాత కుటుంబ సభ్యులను కలిసి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఆలయం సాంకేతికంగా దేవాదాయ శాఖ పూర్తి పరిపాలనా పరిధిలో (కమిటీ పరిధిలో) లేకపోవడంతో నేరుగా ట్రస్ట్ బోర్డుపై చర్యలు తీసుకోలేకపోతున్నామని, అయితే రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఏసీ స్పష్టం చేశారు.








