మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్‌కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పంచ్‌లు వేశారు. నిన్నటి వరకు జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు పూజారిగా ఉన్నప్పుడు సాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు, 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలేనన్నారు.
కోటరీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపిస్తుందని, టీడీపీలో చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? ఆ కోటరీల గురించి బయట ఉన్నవారెవరైనా మాట్లాడితే బాగుంటుందన్నారు. అంతేకానీ కోటరీలో ఉండి వచ్చిన వ్యక్తులే కోటరీ గురించి మాట్లాడటం భావ్యం కాదన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయిన తర్వాత ఇంతకన్నా పద్దతిగా మాట్లాడతారని మేం అనుకోలేదని సెటైర్ వేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానన్న సాయిరెడ్డి ప్రస్తుత మాటల్లో మార్పు చాలా స్పష్టంగా, భిన్నంగా కనిపిస్తోందన్నారు. విజయసాయిరెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరిపై ప్రేమ పుట్టిందనే అనుకోవాలన్నారు.
పార్టీ విజయం సాధిస్తే ఇలా మాట్లాడేవారేనా?
గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ రెండోసారి సీఎం అయ్యుంటే పార్టీ నుంచి వెళ్లినవారంతా ఇలా మాట్లాడే వారేనా?, పార్టీని వీడి వెళ్లిపోయే వారేనా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మాటలను బట్టి ఆయన వ్యవసాయం చేయబోవడం లేదు, రాజకీయమే చేస్తారని స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో జరిగిన తప్పును దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తాయని, వేరే వ్యక్తుల పేర్లు చెప్పినంత మాత్రాన వారంతా నిందితులు అయిపోతారా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్రలు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయని అమర్ చెప్పారు.