విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం సాధించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ రావడం జగన్ ఘనతేనని స్పష్టం చేశారు.
గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్రకు పలు కీలక ప్రాజెక్టులు వచ్చినట్లుగా వివరించారు. వైసీపీ చెప్పేవాటికి జీవోలతో సహా అన్ని ఆధారాలున్నాయని, కానీ, ఆ ప్రాజెక్టులన్నీ కూటమి సాధించినట్లు బిల్డప్ ఇస్తోందన్నారు. తాము చెప్పేది నిజం కాదని చెప్పే దమ్మూ, ధైర్యం మంత్రి లోకేష్‌కు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర కోసం జగన్..
ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.700 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వాటర్ ప్రాజెక్టును వైఎస్ జగన్ నిర్మించారని గుడివాడ అమర్ గుర్తుచేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన రాయి వేశారని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు పరిష్కరించి పనులు ప్రారంభించింది కూడా వైసీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
అవగాహనారాహిత్యం
నారా లోకేష్‌పై గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఏమి చేశారో లోకేష్ ఆత్మవిమర్శ చేసుకోవాలని, అవగాహనారాహిత్యం మాట్లాడొద్దని సూచించారు.
సవాల్‌కు సిద్ధమా..?
ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులన్నీ వైసీపీ ప్రభుత్వ చొరవతోనే సాధించబడ్డాయని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులన్నీ వైసీపీ సాధించిన ప్రాజెక్టులుగా అమర్ వివరించారు. తాము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశామో బహిరంగ చర్చకు సిద్ధమని, చర్చకు వచ్చే దమ్ము మంత్రి లోకేష్‌కు ఉందా..? అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.