గూగుల్ సంచలన ప్రయోగం.. దోమల కోసం 3.2 కోట్ల సైన్యం!

గూగుల్ సంచలన ప్రయోగం.. దోమలను తుద‌ముట్టించేందుకు 3.2 కోట్ల సైన్యం!

Summarize with AI

దోమల (Mosquitoes) నివారణ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మస్కిటో కాయిల్స్(Mosquito Coils), లిక్విడ్‌లు (Liquid Vaporizers) లేదా మున్సిపాలిటీ వారు కొట్టే కెమికల్ స్ప్రేలు. కానీ, దోమలను అరికట్టడానికి ఏకంగా కోట్ల సంఖ్యలో దోమలను పర్యావరణంలోకి వదలడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, సరిగ్గా గూగుల్ (Google) సంస్థ ఇప్పుడు ఇదే వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. దోమల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా 32 మిలియన్ల (3.2 కోట్లు) ప్రత్యేక దోమల సైన్యాన్ని రంగంలోకి దించబోతోంది.

గూగుల్‌కు చెందిన సైన్స్ విభాగం ‘డీబగ్’ (Debug) ప్రాజెక్ట్ పేరుతో గత దశాబ్ద కాలంగా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా (Florida), కాలిఫోర్నియా (California) రాష్ట్రాలలో రెండేళ్ల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు గూగుల్ అనుమతులు కోరింది.

ఇంతకీ ఈ ప్రయోగం ఎలా పనిచేస్తుంది?
ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ సైన్స్ బృందం ప్రయోగశాలలో ప్రత్యేకంగా మగ దోమలను ఉత్పత్తి చేస్తుంది. వీటికి ‘వోల్బాచియా పిపియెంటిస్’ (Wolbachia pipientis) అనే ఒక రకమైన బ్యాక్టీరియాను ఎక్కిస్తారు. ఈ బ్యాక్టీరియా ఉన్న మగ దోమలు, బయట ఉండే ఆడ దోమలతో జతకట్టినప్పుడు.. వాటి ద్వారా వచ్చే గుడ్లు పొదగవు. దీనివల్ల కాలక్రమేణా కొత్త దోమల ఉత్పత్తి ఆగిపోయి, వాటి జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వైరస్‌ల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది.

ఈ ప్రయోగంలో కేవలం మగ దోమలను మాత్రమే పర్యావరణంలోకి విడుదల చేస్తారు. సాధారణంగా మగ దోమలు మనుషులను కుట్టవు, కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. కాబట్టి 3.2 కోట్ల దోమలను వదిలినా మనుషులకు ఎలాంటి అదనపు ఇబ్బంది ఉండదు.

గూగుల్ యాక్షన్ ప్లాన్
గూగుల్ తన ప్రణాళికను రెండు విడతలుగా అమలు చేయనుంది. మొదటి ఏడాది 16 మిలియన్ల (1.6 కోట్లు) ల్యాబ్-బ్రీడెడ్ మగ దోమలను ఫ్లోరిడా, కాలిఫోర్నియా పరిసరాల్లో విడుదల చేస్తారు. రెండో విడ‌త‌గా మరో 16 మిలియన్ల దోమలను విడుదల చేసి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలనిస్తుందో పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) పరిశీలనలో ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే ఖచ్చితమైన ప్రాంతాలు, తేదీలను ప్రకటించనున్నారు.

కొత్తదేమీ కాదు.. పాత వ్యూహమే..
కీటకాలను స్టెరిలైజ్ (Sterilize) (సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా) చేసి వాటి జనాభాను తగ్గించే పద్ధతి సైన్స్ ప్రపంచంలో కొత్తదేమీ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా రసాయన రహిత ప్రత్యామ్నాయంగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసే ‘న్యూ వరల్డ్ స్క్రూవార్మ్’ అనే ఈగ లార్వాలను, అలాగే ‘మెడిటరేనియన్ ఫ్రూట్ ఫ్లై’(Mediterranean Fruit Fly) (పండ్ల తోటలను నాశనం చేసే ఈగలు) నివారించడానికి కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ పద్ధతినే ఉపయోగించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని గూగుల్ దోమలపై ప్రయోగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment