రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు.. ‘ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాను. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌కు రాజీనామా లేఖ అందజేయడం జరిగింది. ఆయన రాజీనామాను ఆమోదించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను’.
‘వైసీపీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సంపాదించుకుంది. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ సాధించింది. వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు, నాలాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అని నా అభిప్రాయం’.
‘రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నిర్ణయించుకున్న తరువాత లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్ని వివరించిన తరువాతే రాజీనామా పత్రాన్ని అధ్యక్షులు వైఎస్ జగన్‌కు అందజేస్తాను’.
‘ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడడం సమంజసం కాదు అనేది తన ఉద్దేశమన్నారు. తప్పుకున్న తరువాత ప్రాథమిక సభ్యత్వం ఏముంటుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, వెంకటేశ్వరస్వామిని నమ్ముకున్న వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పను. తన మాటలను అబద్ధాలన్ని అనుకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’.
‘వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. మూడు తరాలుగా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ వరకు మూడు తరాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన జీవితకాలంలో ఏ రోజూ ఆ కుటుంబంతో విభేదాలు రావు, లేవు, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు’.