సోషల్ మీడియా యుగంలో ఏ పదం ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. కొన్నిసార్లు ప్రత్యర్థులను అవహేళన చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి వాడే పదాలే కాలక్రమేణా ఒక పెద్ద డిజిటల్ ఉద్యమంగా రూపాంతరం చెందుతుంటాయి. ‘మోర్ నెగిటివ్.. బికేమ్ పాజిటివ్’(More Negative. Became Positive) అన్న చందంగా.. మొదట హేళనతో మొదలై, ఆ తర్వాత విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రెండు పదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ (Andhra Pradesh) మార్మోగిపోతున్నాయి. అవే.. ‘కాక్రోచ్’ (Cockroach), ‘మావిగన్’ (MaViGun).
దేశవ్యాప్తంగా డిజిటల్ ఉద్యమం..
ఒకరి నోటి నుంచి వచ్చిన అనకూడని మాట.. దేశవ్యాప్తంగా ఒక సరికొత్త డిజిటల్ ఉద్యమానికి తెరతీసింది. నిరుద్యోగ యువతను (Unemployed Youth) ఉద్దేశించి వచ్చిన ఆ వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకున్న నెటిజన్లు, యువత దాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిందే ‘కాక్రోచ్’ ఉద్యమం(Cockroach Movement). ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో ఊహించని మద్దతు లభిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ డిజిటల్ విప్లవం ఇన్స్టాగ్రామ్ (Instagram) రికార్డులను కూడా బీట్ చేసింది. ఏకంగా 21 మిలియన్ల (2.1 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుని, దేశవ్యాప్తంగా ఒక బలమైన నిరసన స్వరంగా ఎదిగింది.

- “వ్యవస్థ మమ్మల్ని కీటకాల్లా చూస్తే.. మేము గర్వంగా బొద్దింకలమే!”
- “మొసళ్ల సామ్రాజ్యమా జాగ్రత్త.. బొద్దింకల సైన్యం వస్తోంది!”
- “మా ఉనికిని తక్కువ అంచనా వేయకండి.. అణుబాంబునైనా తట్టుకునే శక్తి బొద్దింకలకు ఉంది!”
- మీరు హిట్ స్ప్రే కొడితే.. మేము కోట్ల సంఖ్యలో బయటకు వస్తాం!
- “మా గొంతు నొక్కడానికి మీ దగ్గర ‘హిట్ స్ప్రే’ ఉంటే.. మీ సింహాసనాన్ని ఊపేయడానికి మా దగ్గర ఒకే ఒక్క ‘మీమ్’ ఉంది!” అని స్లోగన్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) సైతం దీనిపై స్పందిస్తూ.. “మొసలికి, బొద్దింకలకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, నేను గర్వంగా బొద్దింకల జనతా పార్టీ పక్షాన నిలబడతాను” అని ప్రకటించడంతో ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’(Cockroach Janata Party) నినాదానికి ఒక్కసారిగా పొలిటికల్ మైలేజ్ పెరిగింది.
ఏపీ రాజకీయాల్లో ‘మావిగన్’ కలవరం
జాతీయ స్థాయిలో ‘కాక్రోచ్’ హవా నడుస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ‘మావిగన్’ (MaViGun)నినాదం రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచనలో పడేస్తోంది. మొదట్లో విపక్షాల నుంచి ఈ పేరుపై కాస్త హేళన వ్యక్తమైనప్పటికీ, ఇప్పుడు ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నినాదం కేవలం ఒక పేరు కాదు.. దీని వెనుక ఒక బలమైన ఆర్థిక, భౌగోళిక వ్యూహం ఉందనే చర్చ ప్రజల్లో మొదలైంది. మొదట్లో ‘మావిగన్’ నినాదాన్ని ఆదిలోనే అంతం చేయాలని అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వ్యూహాన్ని రెడీ చేసింది. భారీగా నగదు వెచ్చించి వేల కొద్దీ సోషల్ మీడియా అకౌంట్లను యాక్టీవ్ చేసింది. వందలాది మంది ఇన్ప్లుయెన్సర్లను రంగంలోకి దించి నెగిటీవ్ ట్రోలింగ్‌తో రూమర్స్ స్ప్రెడ్ చేయిందన్న విమర్శలున్నాయి.
మావిగన్ మీద ఎంత దుష్ప్రచారం జరిగినా.. అంతే స్పీడ్‌తో ప్రజల్లో మంచి ఆదరణ కూడా లభించింది. ఒకానొక దశలో ఏపీ రాజధాని గురించి మాట్లాడేందుకే వీల్లేదన్న పరిస్థితి నుంచి.. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ‘మావిగన్’ ప్రతిపాదనతో ఈరోజు వైసీపీ గట్టిగా చర్చించే దశకు చేరుకుంది. రాజధాని మాట మాట్లాడటానికి అవకాశమే లేదన్న వారికి కౌంటర్‌గా.. ‘మావిగన్’ అనే నినాదం బుల్లెట్ స్పీడ్‌తో దూసుకువచ్చి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సైతం ఈ నినాదం కలవరం పుట్టిస్తోంది.

మావిగన్ తెచ్చిన కొత్త చర్చ ఇదే..
కేవలం 29 గ్రామాల పరిధిలో (అమరావతి) (Amaravati) అసలేమీ లేని చోట సుమారు రూ. 1 లక్ష కోట్లు ధారపోయడం కంటే.. కేవలం రూ. 10 నుంచి 20 వేల కోట్ల ఖర్చుతోనే మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు)తో (Machilipatnam-Vijayawada-Guntur) అద్భుతమైన రాజధానిగా మార్చవచ్చనే చర్చను తెరపైకి తెచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతోనే ఏపీకి రాజధాని లేని లోటు భర్తీ అవుతుందని, మూడు ప్రాంతాల సమతుల్యతతో పాటు దాదాపు 60 లక్షల మంది ప్రజలు రాజధాని పరిధిలోకి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మావిగన్ చర్చ అధికార తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసే పరిస్థితిని తెచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా, అవహేళన చేయాలని చూసిన చోటే ఆత్మగౌరవ నినాదాలు పుడతాయని ‘కాక్రోచ్’, ‘మావిగన్’ ఉదంతాలు నిరూపిస్తున్నాయి. డిజిటల్ యుగంలో నెగిటివ్ కామెంట్లను ఎలా పాజిటివ్ మైలేజ్‌గా మార్చుకోవచ్చో చెప్పడానికి ఇవి సజీవ సాక్ష్యాలు. హేళనతో మొదలైన ఈ నినాదాలు, నేడు పాలకులను సైతం ఆలోచింపజేసే స్థాయికి చేరడం విశేషం.







