గౌరవమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక మహిళా ప్రజాప్రతినిధి ఫోన్ కాల్ డేటా (Call Data) తో ఏం పని..? ఆ మహిళా నేత పర్సనల్ లైఫ్ గురించి ఎందుకంత ఆతృత..? కాల్ డేటాను తెప్పించుకునే అవసరం ఏంటి..? ఆవిడతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్ హిస్టరీతో ఆయనకు ఏం అవసరం..? ప్రస్తుతం టీడీపీ (TDP) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishnadevarayalu) ను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఎంపీ కృష్ణదేవరాయలుపై మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) ఇటీవల వెల్లడించిన పలు విషయాలు సంచలనంగా మారాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు చేష్టలపై టీడీపీలోని మహిళా శ్రేణి కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏటీఎం చోరీని ఉపయోగించి కాల్ డేటా
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నరసరావుపేట (Narasaraopet) ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ మంత్రి విడదల రజిని వ్యక్తిగత జీవితంలోకి రావాలనుకున్నాడు. దీంతో ఆమెతోపాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్ డేటా మొత్తాన్ని చూడాలని ప్లాన్ వేశాడట. ఎంపీ పదవి పరపతిని ఉపయోగించి గురజాల డివిజన్ (Gurazala Division) పరిధిలో నమోదైన ఏటీఎం చోరీ కేసు (ATM Theft Case) దర్యాప్తును సాకుగా చూపుతూ ఏకంగా మాజీ మంత్రి విడదల రజినితో పాటు ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన ఏడెనిమిది ఫోన్ నంబర్ల కాల్ డేటాను బయటకు తీశారట. కాల్ డేటా అంటే మామూలు విషయం కాదు. ఒక మనిషి ఎవరితో, ఎక్కడ నుంచి, ఎంత సేపు మాట్లాడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. పొలిటికల్ లైఫ్‌లో ఉన్న ఒక మహిళా నేత కాల్ డేటా సేకరించడం ఆక్షేపణీయమని, ఆ డేటాతో లావుకు ఏం పని అని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్‌కు రజినీ ఫిర్యాదు..
తన వ్యక్తిగత జీవితంలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారన్న తెలుసుకున్న తాను వెంటనే అప్రమత్తమయ్యానని, ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా అప్పటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ని కలిసి ఫిర్యాదు చేశానని ఇటీవల కీలక విషయాలు వెల్లడించారు. వైఎస్ జగన్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును పిలిపించి, ఒక మహిళ విషయంలో ఇలాంటి ఘోరమైన నేరం చేయడం తప్పని మందలించారని వివరించారు.
వైసీపీ ఎంపీగా ఉండగానే టీడీపీలో గ్రూప్‌లు..
ఒక మహిళ అయిన విడదల రజినిని మానసికంగా వేధించడం (Mental Harassment), వెంటపడి మరీ కేసులు పెట్టించడం.. వీటితోనే సరిపెట్టుకోకుండా.. ఆమెను రాజకీయంగా అణగదొక్కేందుకు తన కులాన్ని, తన పలుకుబడిని, తన అధికారాన్ని అన్నింటినీ వాడినట్లుగా సమాచారం. చిలకలూరిపేట (Chilakaluripet) నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గంతో విడదల రజినికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టించారని, ఎంపీ సొంత సామాజికవర్గంలో ఉన్న గ్రూపుల్లో 90 శాతం మంది టీడీపీ వాళ్లే ఉండేవారట. అంటే వైసీపీ ఎంపీగా ఉండగానే.. ప్రత్యర్థి పార్టీకి చెందిన టీడీపీలోని తన సొంత సామాజిక వర్గాన్ని అత్యంత దుర్మార్గంగా తన రాజకీయం కోసం వాడుకునే ప్రమాదకర ఆటకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఒక బీసీ మహిళ (BC Woman) అని కూడా చూడకుండా అప్పటి నుంచే విడదల రజినిపై విష ప్రచారానికి నడుం బిగించారని సమాచారం.
రజినీ ఫ్లెక్సీలను ఓర్వలేక కేంద్రానికి ఫిర్యాదు..
చిలకలూరిపేటలో విడదల రజిని కోసం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు కడితే… వాటిని కూడా ఓర్చుకోలేక పోయారని, నియోజకవర్గంలో ఆమె ఫ్లెక్సీలు ఉండటానికి వీల్లేదని, వాటిని తొలగించాలంటూ.. 07-06 2021 తేదీన ఏకంగా న్యూఢిల్లీ (New Delhi) కి చెందిన నేషనల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (National Highway Authority of India – NHAI) చైర్మన్ సుగ్బీర్ సింగ్ (Sukhbir Singh) సంధుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాలు లేఖ రాశారు. కేవలం విడదల రజినికి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించాలని కోరుతూ లేఖ రాసి మహిళపై విచిత్రమైన ప్రతీకార చర్యలకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదులో ఏకంగా విడదల రజిని ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీల ఫొటోలను కూడా జత చేశారని సమాచారం.
టీడీపీలోకి జంప్ ముందస్తు ప్రణాళికే..
విడదల రజిని పతనమే లక్ష్యంగా గత 7 సంవత్సరాలు (Seven Years) గా ప్లాన్ ప్రకారం ఆమెపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాడని, అందుకు ఎంపీ చేష్టలే నిదర్శనం అంటున్నారు. చిలకలూరిపేటలో ఏ మాత్రం నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత లేని మనుషులను ఎంపీ ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి నిత్యం విడదల రజినీపై అవినీతి ఆరోపణలు చేయించేవారట. టీడీపీలోకి వెళ్లిపోవాలనే ముందస్తు ఆలోచనలో భాగంగానే నరసరావుపేట పార్లమెంట్ (Narasaraopet Parliament) పరిధిలో వైసీపీని బలపరిచినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేసినట్లుగా విమర్శలొస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గం వారు మాత్రమే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని, వారు మాత్రమే ఇకపై కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఆలోచన ధోరణితోనే మర్రి రాజశేఖర్‌పై అభిమానం చూపుతూ విడదల రజినిని రాజకీయంగా అణగదొక్కేలా పావులు కదిపారని అంటున్నారు. ఇప్పుడు ఆ మర్రి రాజశేఖర్ కూడా టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఇదంతా ముందే రాసుకున్న స్క్రిప్టు. ఆ ప్రకారమే వారి రాజకీయ అడుగులు పడ్డాయన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల నుంచి వెల్లడవుతోంది.
ఆ ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలరా..?
దేశ చరిత్రలో ఒక బీసీ వర్గానికి చెందిన మహిళ పతనమే లక్ష్యంగా ఇంతగా కుయుక్తులు పన్నిన నేత మరొకరు ఉండరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమే ఇలాంటి దౌర్భాగ్యమైన రికార్డు నెలకొల్పాడని సెటైర్లు వేస్తున్నారు. విడదల రజినిపై అతడు చేసిన ఒక్క ఆరోపణననైనా నిరూపించే దమ్ము ఉందా..? అవన్నీ బూటకపు ఆరోపణలు మాత్రమే అని స్థానికంగా ఉన్న వైసీపీ (YCP) క్యాడర్ ఆగ్రహిస్తోంది. విడదల రజిని వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా సాగుతున్న కుట్రగా కృష్ణదేవరాయలు చర్యను అభివర్ణిస్తోంది. విడదల రజిని అనే వ్యక్తిని రాజకీయంగా లేకుండా చేసి, తన సొంత సామాజికవర్గం వారు మాత్రమే చిలకలూరిపేటలో రాజకీయాలు చేసేలా చూడటమే కృష్ణదేవరాయలు ఆశయంగా పెట్టుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. రజినీపై ప్రతీకార చర్యలో భాగంగానే స్టోన్ క్రషర్స్ యజమాన్యంతో మాట్లాడి దగ్గరుండి మరీ పోలీసులతో కేసు నమోదు చేయించినట్లుగా ఎంపీ కృష్ణదేవరాయలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపీ చేష్టలను అసహ్యించుకుంటున్న మహిళా శ్రేణి
ఒక బీసీ మహిళ (BC Woman) కు సంబంధించిన కాల్ డేటాను ఆమె అనుమతి లేకుండా సేకరించి, ఆమె వ్యక్తిగత జీవితంలోకి రావాలని చూడటం నీచమైన చర్య అంటూ టీడీపీలోని మహిళా నేతలే అసహ్యించుకుంటున్నారు. ఎంపీగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సాక్షిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఒక మహిళా నేతను అణచివేసేందుకు ఇంత కుట్ర చేయడాన్ని అందరూ చీదరించుకుంటున్నారు. గౌరవమైన పదవిలో ఉంటూ మహిళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.