నెల్లూరు జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న సాయంత్రం కోర్టు ఆదేశాలను జైలులో న్యాయవాదులు సమర్పించినా, సమయం మించిపోవడంతో విడుదల వాయిదా పడింది. ఈరోజు ఉదయం జైలు నుంచి కాకాణి విడుదల కాగా, జైలు వద్దకు కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకొని హర్షం వ్యక్తం చేశారు.
విడుదల అనంతరం మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “అక్రమ కేసుల్లో 86 రోజులు జైలు జీవితం గడిపాను. నిన్ననే విడుదల కావలసి ఉండగా ఆలస్యం ఎక్కడ జరిగిందో తెలియదు. నా రాక కోసం పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజాభిమానులకు కృతజ్ఞతలు. నా ఆస్తి నెల్లూరు జిల్లా ప్రజలే, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ కుటుంబాలు” అని పేర్కొన్నారు. షరతుల కారణంగా కేసులపై వ్యాఖ్యానించకూడదనుకున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని సాంప్రదాయాలను పరిచయం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
“నా మీద ఆరు సోషల్ మీడియా కేసులు పెట్టారు. ఏడు పిటీ వారెంట్లు వేశారు. లిక్కర్ పంచి ఓటేయమన్నానని కేసు పెట్టడం హాస్యాస్పదం. సర్వేపల్లి రిజర్వాయర్‌లో బాంబులు పెట్టి మట్టిని తవ్వానని ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. అనేక అక్రమ కేసులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు జైలు పాలవుతున్నారు. కానీ కేసులకు భయపడే పరిస్థితి లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు అక్రమాలపై నా పోరాటం కొనసాగుతుంది” అని కాకాణి స్పష్టం చేశారు. జైలు అంతా అక్రమ కేసులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయిందన్నారు. సోమిరెడ్డి, అతని కుమారుడు దుశ్చర్యలకు ఎదురునిలుస్తామని, చార్జ్ షీట్ వేసే వరకు జిల్లాలో ఉండకూడదన్న షరతు ఉందని, తాను ఎక్కడ ఉన్నా అనేక మార్గాల గుండా తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
మా @YSRCParty అధికారంలో లేని సమయంలో జరిగిన అంశంపై నాపై కేసు పెట్టారు
— Telugu Feed (@Telugufeedsite) August 20, 2025
ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పంచుతున్నానని చెప్పానట.. దానిపై వ్యక్తి ప్రశ్నిస్తే దాడిచేశామట.. ఎంత హాస్యాస్పదమైన కేసు ఇది..
జైలు నుంచి విడుదల అనంతరం మీడియాతో కాకాణి pic.twitter.com/48fyXLgbUD







